ఈ సంవత్సరం బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమైయ్యాయి. రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఆ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విపక్షాల నిరసనలతో ఉదయం 11 గంటలకు ఓసారి వాయిదాపడ్డ సభ. ఆ తర్వాత మళ్లీ రెండవ సారి కూడా వాయిదా వేశారు.
రూల్ 267 ప్రకారం సభకు నోటీసు ఇచ్చామని, ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి.. ఇంధన ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని కోరామని ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అప్రాప్రియేషన్ బిల్లును చేపట్టే వరకు ఆగలేమని, ధరలు పెరుగుతున్నా కొద్దీ.. సామాన్యుడు బాధలు ఎక్కువవుతున్నాయని ఖర్గే అన్నారు. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే చైర్మన్ క్లారిటీ ఇచ్చారని, ఆ నిర్ణయాన్ని మార్చలేమని అన్నారు. దీంతో విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను ఒంటి గంట వరకు వాయిదా వేశారు.