భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వారు విన్నవించారు.
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సిఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఫైనాన్స్ అడ్వయిజర్ రమేశ్, కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్, ఇ.డి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ పరిస్థితిని వివరించారు.
‘‘క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’’ అని అధికారులు సిఎంకు వివరించారు.
‘‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుంది. క్రమంగా ఇది పెరుగుతున్నది. దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అయితే డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నది. లాక్ డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయి’’ అని వారు వివరించారు.
ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సిఎం చెప్పారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని సిఎం అభినందించారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని సిఎం అన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సిఎం పిలుపునిచ్చారు.