రాష్ట్రంలో రూ. 500 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు రానున్నాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ హెచ్ఎండీఏ గ్రౌండ్లో 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్…తెలంగాణ చేపలు రుచిగా ఉంటాయని తెలిపారు.
సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి ఆలోచన చేశారని తెలిపారు. మత్స్య పరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నీళ్లలో చేపల ఉత్పత్తి చేస్తోందన్నారు. రాష్ర్టంలో నీలి విప్లవం అద్భుతంగా కొనసాగుతుందని…ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వాళ్లం.. ఇప్పుడు చేపలను ఎగుమతి చేసే స్థానానికి ఎదిగామన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని భావించిన సీఎం కేసీఆర్.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారని తెలిపారు. మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.