హోంగార్డులకు నూతన సంవత్సర కానుకను అందజేశారు సీఎం కేసీఆర్. జనవరి నుంచి హోంగార్డులకు ప్రతి నెల రూ. 20 వేల జీతాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి సంవత్సరం రూ. వెయ్యి పెంచుతామని ప్రకటించారు. ప్రగతి భవన్‌లో హోంగార్డులతో సమావేశమైన సీఎం కేసీఆర్ హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు. హోంగార్డులకు ప్రత్యేకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి తీరుతామన్నారు.
అప్పట్లో గత ముఖ్యమంత్రులతో హోంగార్డుల జీతాల పెంచాలని కోట్లాడినమని తెలిపారు. ఉద్యమ సమయంలో హోంగార్డులకు మూడు వేల జీతం వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 వేలకు పెంచామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో హోంగార్డులు 18500 మంది ఉన్నారని తెలిపారు. ఇవాల్టీ నుంచి కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో హోంగార్డులకు ప్రత్యేక రిజర్వేషన్ అమలుచేస్తామని తెలిపారు. స్పెషల్ పోలీస్‌లో హోంగార్డులకు రిజర్వేషన్ 25 శాతం,జిల్లాల్లో రిజర్వ్ డ్ పోలీసులకు 15 శాతానికి,పీటీవో డ్రైవర్లకు 20 శాతానికి పెంచుతున్నామని తెలిపారు. హోంగార్డు మెకానిక్స్ 10 శాతం,ఎస్పీఎఫ్ హోంగార్డులు 25 శాతం,ఫైర్ డిఫార్ట్ మెంట్ 25 శాతం,ఎస్‌ఐఆర్‌సీపీఎల్ 25 శాతం,పోలీస్ కమ్యూనికేషన్స్ 10 శాతానికి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
ట్రాఫిక్‌లో పనిచేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా జీతాలు ఇస్తామని తెలిపారు. మహిళా హోంగార్డులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డులకు హెల్త్ ప్యాకేజీని ప్రకటిస్తున్నామని సీఎం చెప్పారు. హోంగార్డుల కుటుంబాలకు హెల్త్ ఇన్సురెన్స్ ఇవ్వబోతున్నామని తెలిపారు.
తెలంగాణ వస్తే దేశంలోనే ధనిక రాష్ట్ర అవుతుందని ఆనాడే చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరిని వెట్టి చాకిరి చేయించమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులకు పోతున్నాయని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లు,టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తున్నామని తెలిపారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్‌కు ఇబ్బందులు ఉన్నాయని….హోంగార్డుల నియామకాలు జరిగేటప్పుడు రోస్టర్ విధానాన్ని పాటించలేదన్నారు.