ఐరోపా (యూరప్) దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసి ముంచేసిన కిలాడీ దంపతుల మోసాన్ని విజయవాడ పోలీసులు గుట్టురట్టు చేశారు. ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ పేరుతో సాగించిన ఈ భారీ మోసానికి సంబంధించి నిందితులైన సౌజన్య, శ్రీనివాస్ దంపతులను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
యూరోపియన్ దేశాల్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈ దంపతులు విపరీతంగా ప్రచారం చేశారు. వీరి మాటలు నమ్మిన దాదాపు 750 మంది నిరుద్యోగ యువకులు రూ.11.46 కోట్ల వరకు వారికి చెల్లించారు. డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోగా, చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా వేధించడంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.నిరుద్యోగుల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్ముతో నిందితులు కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాంతంలో భారీగా స్థిరాస్తులు (Real Estate) కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Also Read:సోనమ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రుల ఆరా
ప్రస్తుతం నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు మరియు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పాస్‌పోర్టులు, కష్టపడి సంపాదించిన సొమ్మును కన్సల్టెన్సీకి అప్పగించి మోసపోయామని, ప్రభుత్వం తమకు న్యాయం చేసి సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. అనధికారిక కన్సల్టెన్సీలను నమ్మి విదేశీ ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

