పాత నోట్ల డిపాజిట్‌కు గడువు సమీపిస్తున్న కొద్ది…..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది కేంద్రం. డిసెంబర్ 30 గడువు సమీపిస్తున్న కొద్ది కొత్తకొత్త నిబంధనలతో ఉక్కిరిబిక్కిరిచేస్తోంది.డిసెంబర్ 30 తర్వాత అవన్నీ చెల్లని నోట్లే. రద్దయిన నోట్లను శుక్రవారంలోగా బ్యాంకులో జమ చేయకుండా తమ వద్దే పెట్టుకున్నవారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 30 తుది గడువు కాగా, అది ముగిసిన తరువాత కూడా రద్దయిన రూ.1000, రూ.500 నోట్లలో ఒక్కొక్కటీ 10కి మించి అట్టేపెట్టుకున్న వారికి జరిమానా విధించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. వీటి మొత్తం విలువ రూ.10,000కు మించకూడదు. మించితే జరిమానా విధిస్తారు. ఈ నోట్లను ఇతరులకు బదిలీ చేసినా, ఇతరల నుంచి తీసుకున్నా ఈ నిబంధనలే వర్తిస్తాయి.
కనీసం రూ.50 వేలు జరిమానా.. లేదంటే ఆ నోట్ల విలువకు అయిదు రెట్లు అధికంగా జరిమానా.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని వర్తింపు చేసేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. రద్దయిన నోట్లను రిజర్వు బ్యాంకు వద్ద మార్చుకోవడానికి మార్చి 31వరకు అవకాశం ఉన్నా, ఆ సమయాన్ని కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ఆ నోట్లుకు సంబంధించినంతవరకు వాటికి సమానమైన విలువను చెల్లిస్తామని రిజర్వు బ్యాంకు ఇచ్చిన హామీని రద్దు చేస్తు కూడా ఈ అత్యవసర ఆదేశాల్లో పొందుపరచనున్నారు. శుక్రవారానికి ముందే ఆర్డినెన్స్ ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉంది. 1978లో కూడా పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు అప్పటి జనతా ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది.