టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..

437
TDP MLA JC Prabhakar reddy Arrested
- Advertisement -

ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీయే కార్యాలయానికి వచ్చిన ఆయనను గేటువద్దే అడ్డుకుని అరెస్టుచేసి, స్టేషన్‌కు తరలించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల విషయంలో శ్రీనివాస్‌గౌడ్‌ కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాము నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతున్నామని.. అవసరమైతే ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంవద్ద చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఆయన సవాల్‌ను స్వీకరించిన శ్రీనివాస్‌గౌడ్‌ ఇవాళ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం వద్దకు అనుచరులతో సహా చేరుకుని బైఠాయించారు.

మరోవైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జేసీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఆరోపించారు. స్టేజి క్యారియర్ల పేరుతో ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం జరుగుతోందని శ్రీనివాసగౌడ్ అన్నారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని, ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని, అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని అన్నారు.

- Advertisement -