‘ఆర్ఆర్ఆర్’ నుండి మరో మేకింగ్‌ వీడియో..!

40
rrr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రణం రౌద్రం రుధిరం). ఈ సినిమా చకచకా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. రెండు పాటలను చిత్రీకరించడానికి జక్కన్న సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విడుదల చేస్తున్నారు. ఓ వైపు చిత్రీకరణ జరుగుతుండగా, మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ స్పీడును పెంచుతున్నారు.

అందులో భాగంగా ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, రామరాజు ఫర్‌ భీమ్‌, భీమ్‌ ఫర్ రామరాజు, కొవిడ్ ఫస్ట్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌ స్టార్ట్ అయినప్పుడు ఓ మేకింగ్‌ వీడియోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు జూలై 15న మరో ప్రమోషనల్‌ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఈ మేకింగ్‌ వీడియో ఎలాంటి సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేయనుందో చూడాలి.

గోండు వీరుడు కొమురం భీమ్‌గా తారక్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌లతో పాటు సముద్రఖని, అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి, ఒలివియా మోరిస్‌ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనే దానిని ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.