ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు..

61
MP Raghurama Krishnam Raju

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి.. రఘురాజు మీడియా లేదా సోషల్ మీడియా ముందు మాట్లాడకూడదని ఆదేశించింది. తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశించింది. విచారణను ప్రభావితం చేసే పనులు చేయకూడదని చెప్పింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయిందని, కాబట్టి రాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని చెప్పింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది.

విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని… విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రఘురాజు సహకరించాలని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం చెప్పింది. వారం రోజుల్లోగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తు ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను వినింది. దాదాపు మూడు విడతలుగా కేసును విచారించింది.

కాగా, ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు రాఘురామను అరెస్ట్ చేశారు. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్‌ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే… ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో… ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది.