శివ స్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడంటే భయం లేదు.. భక్తులంటే గౌరవం లేదు. ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేకుండా పోయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న శివ స్వాములపై పోలీసుల దాడి దుర్మార్గమని ఆమె విమర్శించారు.
అదే సమయంలో ద్వంద్వ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరిగినప్పుడు ఈ లాఠీలు ఎక్కడికి పోయాయి? అప్పుడెందుకు పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు? ఇప్పుడు మాత్రం భక్తులపై ఎందుకు లాఠీలు లేస్తున్నాయి? అంటూ రోజా ప్రశ్నించారు. ఇది స్పష్టమైన రాజకీయ కక్ష సాధింపేనని, ప్రజల మత విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రజల గొంతు నొక్కుతోందని, ముఖ్యంగా హిందూ దేవాలయాలు, భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోజా మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్

