ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. లంక బౌలర్లను చీల్చిచెండడాడు. ఉచకోత కోసినట్లు దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీలైన్ బయటికి పంపాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా భారత్ 88 పరుగుల తేడాతో లంకపై గెలుపొందింది.
భారత్ విధించిన 261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కుశాల్ పెరీరా,తరంగ భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో 14 ఓవర్లలో 150 పరుగులతో ఉన్న శ్రీలంక గెలుస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ కుల్‌దీప్ వేసిన మ్యాజిక్ స్పెల్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి లంక నడ్డివిరిచాడు. తర్వాతి ఓవర్‌లో చాహల్ కూడా 3 వికెట్లు తీయడంతో లంక కొలుకోలేకపోయింది.దీంతో శ్రీలంక17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తాను చేసిన తప్పేంటో లంక కెప్టెన్ పెరీరాకు కొద్దిసేపట్లోనే తెలిసిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 10 సిక్సర్లు, 12 ఫోర్లతో 43 బంతుల్లోనే 118 పరుగులు చేశాడు. రోహిత్‌కు తోడు మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి టీ20 24న ముంబైలో జరగనుంది.
ఈ మ్యాచ్ సందర్భంగా పలు రికార్డులు బద్దలయ్యాయి.
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతులు)తో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేసిన రోహిత్.
భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ అవతరించాడు. గతంలో ఈ రికార్డు లోకేష్ రాహుల్ (110) పేరిట ఉంది.
టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ రోహిత్
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన భారత ఆటగాడిగా అవతరించిన రోహిత్. గతంలో యువీ 7 సిక్సర్లు బాదాడు.
165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్-లోకేష్. టీ20ల్లో ఏ జోడీకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
India secure the T20I series with a convincing win in the 2nd T20I by 88 runs: https://t.co/0bKvyteuvU #INDvSL pic.twitter.com/eo8LCgw17n
— ICC (@ICC) December 22, 2017