వన్డే వరల్డ్ కప్ తరువాత ఆ వెంటనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది టీమిండియా.. ఇక ఈ నెలలోనే దక్షిణాఫ్రికా టూర్ వెళ్లాల్సి ఉంది. సఫారి జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక సౌతాఫ్రికా టూర్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించింది బీసీసీఐ. ఈ టూర్ లో వన్డే, టీ20 మ్యాచ్ లకు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. వరల్డ్ కప్ లో ఈ ఇద్దరు కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. కానీ టీమిండియా కప్ సాధించలేకపోయింది. ఇకపోతే వరల్డ్ కప్ తరువాత ఆ వెంటనే ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు కూడా వీరిద్దరు దూరంగానే ఉన్నారు.
ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే, టీ20 లకు కూడా దూరంగా ఉండటంతో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారిద్దరు మరికొన్ని రోజులు విశ్రాంతి కోరినట్లు బీసీసీఐ తెలిపింది. అందుకే సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే టెస్ట్ మ్యాచ్ లకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. సఫారీలతో జరిగే వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, టీ20 లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో నేడు కీలక పోరు జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో రెండు విజయాలు సాధించిన టీమిండియా మూడో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు ఆసీస్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ నాగ్పుర్ లో జరగనుండగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
Also Read:దుబాయ్‌కు ప్రధాని మోడీ..