వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే వారికి దాన్ని మార్కెట్ చేసుకోవడం ఎలాగో కూడా తెలిసుండాలి. ‘బాహుబలి’ సినిమా విషయంలో రాజమౌళి అండ్ టీమ్ మార్కెటింగ్ విజయమే సాధించింది. ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా అని ప్రచారం చేసి ఎన్నో ఏళ్లుగా సినిమా హాళ్లకు రానివారిని సైతం రప్పించింది. ఇప్పుడు ఇంతకంటే పెద్ద వ్యూహాన్నే వేశాడట ‘రోబో 2.0’ డైరెక్టర్ శంకర్.
రోబో 2.0 కు పబ్లిసిటీ కోసం తన మాస్టర్ మైండ్‌ను వాడబోతున్నాడట. జాతీయస్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో క్రేజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నాడట.
రోబో 2.0 లో రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి తమిళ జనాలు చూస్తారు.. విలన్‌గా అక్షయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్‌లో మంచి ప్రమోషన్ లభిస్తుంది. మరి, టాలీవుడ్ మాటేమిటి. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఇందులో ఓ స్పెషల్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యాడట. తెలుగులో తన సినిమాను మార్కెట్ చేసుకోవడానికి, జనాలను థియేటర్లవైపు రప్పించడానికి కచ్చితంగా ఓ స్టార్ హీరో సహాయం తీసుకోవాలని భావిస్తున్నాడట.
కనీసం ఐదు నిమిషాలైనా ఆ స్టార్ హీరో తెరపై కనబడేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి, శంకర్ కన్ను ఏ స్టార్ హీరోపై పడిందో, ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్!