అమెరికాలో రోడ్డు ప్రమాదం..నల్గొండ యువతి మృతి

3
- Advertisement -

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక యువతి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన అమెరికాలోని షికాగో నగరంలో చోటుచేసుకుంది. మృతురాలిని నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్యగా గుర్తించారు.

ఆమె షికాగోలోని ప్రసిద్ధ రూజ్ వెల్ట్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతోంది. ఈ క్రమంలో నవ్య తన స్నేహితులతో కలిసి కారులో పార్ట్ టైమ్ ఉద్యోగానికి బయలుదేరింది. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో ఉండగా.. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన మరో కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో నవ్య కారు వెనుక సీట్లో కూర్చుని ఉంది. వెనుక వైపు నుంచే ప్రమాదం బలంగా జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తూ తీవ్ర రక్తస్రావం కావడంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మిగిలిన స్నేహితులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

Also Read:చైనాలో పుతిన్ పర్యటన

ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును అందుకుంటుందని ఆశించిన కుమార్తె.. ఇలా పరాయి దేశంలో రోడ్డు ప్రమాదానికి గురై శవమైందనే వార్త వినగానే నవ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చెరువుగట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -