రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసి, ఆ ప్రాంత ప్రజల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారని ఆమె మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతం శాశ్వతంగా కరువు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఎన్నో ఏళ్లుగా నీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమకు ఈ ప్రాజెక్టు జీవనాధారమని రోజా అన్నారు. అలాంటి కీలక ప్రాజెక్టును నిలిపివేయడం అంటే రాయలసీమ ప్రజలను వెనక్కి నెట్టడమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన అంటే అభివృద్ధి కాదు, వెన్నుపోటుల రాజకీయమేనని విమర్శించారు.
రాయలసీమకు ఇంతటి అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని రోజా ప్రశ్నించారు. ఇందుకోసమేనా పవన్ చంద్రబాబుతో చేతులు కలిపింది? ఇందుకోసమేనా కూటమిని గెలిపించింది? అంటూ నిలదీశారు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన పవన్ మౌనంగా ఉండటం దేనికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్
మ్యాప్‌లో ఈ రాష్ట్రం లేకుండా చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా? అని రోజా ఘాటు ప్రశ్న వేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని, ప్రజలు ఈ మోసాన్ని త్వరలోనే గుర్తిస్తారని ఆమె హెచ్చరించారు.

