నా అరెస్ట్ విషయంలో మీడియా అత్యుత్సాహం:ఆర్జీవీ

7
- Advertisement -

ఏడాది క్రితం తను చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు కావడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. తన అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. తనపై నమోదైన కేసులు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయనే అనుమానంతోనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

మనది ఫ్రీ వరల్డ్. వ్యంగ్యం అనేది మీడియా సహా ప్రతి చోటా ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వందలాది మీమ్స్ కనిపిస్తాయి. నేను ఏడాది క్రితం చేసిన పోస్ట్ కూడా అలాంటిదే. అయితే ఏడాది తర్వాత ఒక వ్యక్తి మేలుకుని నాపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఒకే పోస్ట్ ను కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అనే అనుమానంతో నేను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాను. ఇంతవరకు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించలేదు.

ఇంతలో ఒక సెక్షన్ మీడియా సంస్థలు వర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, వర్మ భయపడి పారిపోయాడని న్యూస్ టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇదే మీడియా సంస్థలు అనేక ప్రోగ్రామ్స్ నాయకుల మీద, ఇతరుల మీద నెగిటివ్ గా చేస్తుంటాయి. మొదటి సారి పోలీసులు సంప్రదించినప్పుడు నేను అందుబాటులో లేను. రెండోసారి కూడా ఇంకాస్త సమయం కావాలని అడిగాను. కావాలంటే వర్చువల్ గా వీడియోలో మీతో మాట్లాడుతాను అని చెప్పాను. కోవిడ్ టైమ్ నుంచి వర్చువల్ చాలా కేసుల్లో విచారణలు జరుగుతున్నాయి. నేను అప్లై చేసుకున్న ముందుస్తు బెయిల్ విషయంలో జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతోంది. నేను పొలిటికల్ మూవీస్ మానేస్తా అని చెప్పింది అక్కడ జరిగే సెన్సార్ ఇబ్బందులు వల్ల. ఏడాది పాటు ఆ సెన్సార్ కోసం వెయిట్ చేయడం చిరాకుగా ఉండి పొలిటికల్ బేస్డ్ మూవీస్ రూపొందించను అని చెప్పాను. నేను ఏదైనా పోస్ట్ చేస్తే నన్ను, నా ఫ్యామిలీని తిడుతూ వందల కామెంట్స్, మీమ్స్ వస్తాయి. పత్రికల్లో వచ్చే కార్టూన్స్ ఎవరో ఒక నాయకుడి మీద సెటైర్ వేసేవి. ఇది దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. నేను చేసిన పోస్ట్ లో అర్థం మీకు ఒకలా, నాకు ఒకలా కనిపించవచ్చు. అది ఎవరి వ్యక్తిగత దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. నేను చేసిన తప్పేంటో, ఏ సెక్షన్ లో అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పకముందే కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయి అన్నారు.

Also Read:నారా లోకేశ్‌ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన

- Advertisement -