ధృవ సినిమాతో విభిన్న కథలకు పెద్దపీట వేస్తున్న రామ్ చరణ్ తాజాగా మరోసారి అలాంటి మ్యాజిక్ చేసేందుకు రంగస్ధలం అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. రామ్ చరణ్ సరసన సమంత నటించగా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. మరి ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాతో చెర్రీ మ్యాజిక్ చేశాడా లేదా చూద్దాం..
కథ:
రంగస్థలం అనే గ్రామానికి ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). గ్రామంలో అతను చెప్పిందే వేదం. అతని పేరు పలకడానికి కూడా జనం భయపడుతుంటారు. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజిన్‌ను నడుపుతూ ఉంటాడు చిట్టిబాబు(రామ్ చరణ్). అతడికి చెవుడు.అన్న కుమార్‌బాబు(ఆది) చదువుకుని దుబాయ్ ఉద్యోగం చేసి వస్తాడు. అదే ఊరిలో ఉండే రామలక్ష్మి(సమంత)కి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. సీన్ కట్ చేస్తే గ్రామంలో రైతులందరిని మోసం చేస్తుంటాడు ఫణీంద్ర.
ఈ క్రమంలో కుమార్‌కు ఫణీంద్రకు గొడవ జరుగుతుంది…చివరకు ఆ గొడవ ఎక్కడికి దారి తీసింది..? సర్పంచ్ ఎన్నికల్లో కుమార్ గెలిచాడా లేదా అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,నేపథ్యం,రామ్ చరణ్ నటన,పాటలు,నేపథ్య సంగీతం. తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు రామ్ చరణ్. చెవిటివాడిగా చరణ్ పండించిన కామెడీ అద్భుతం. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపించాడు. దటీజ్ చరణ్ అనేలా చెవిటివాడి పాత్రకి ప్రాణం పోశాడు. సినిమాకు మరో హైలెట్ సమంత. చెర్రీ-సమంత కెమిస్ట్రీ స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. ప్రెసిడెంట్‌గా జగపతిబాబు చక్కగా ఒదిగిపోయారు. అన్యాయాన్ని నిలదీసే వ్యక్తి పాత్రలో ఆది నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా 1985 నాటి కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని తలపించేలా తీసిన సన్నివేశాలు కట్టిపడేస్తాయి.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సెకండాఫ్. ఫస్టాఫ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన సుకుమార్..సెకండాఫ్‌పై కాస్త దృష్టి పెడితే బాగుండేది. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే నెమ్మదించినట్లు కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. చాలాకాలం తర్వాత సుకుమార్ మరో అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ప్రతీ సన్నివేశంలో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి దుస్తులు.. వేషధారణ.. వస్తువులు ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు గోదావరి అందాలు తోడవటంతో తెరపై మరింత అంతగా కనిపించాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి కథనే ఎంచుకుని 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తెరకెక్కించిన దృశ్యకావ్యం రంగస్ధలం. ఇలాంటి క్లిష్టమైన కథను ఎంచుకున్న దర్శకుడు సుకుమార్‌ను అభినందించాల్సిందే. గ్రామీణ నేపథ్యం,అది 35 సంవత్సరాల క్రితం పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు చూపించడంలో ఏమాత్రం తేడా కొట్టిన సుకుమార్ కష్టం వృధాగా పోయేది. కానీ ఏచిన్న పొరపాటు లేకుండా అద్భుతమైన సినిమాను ప్రేక్షకులను అందించడంలో సక్సెస్ అయ్యాడు సుకుమార్. రామ్‌చరణ్ నటన,కథ,విజువల్స్
సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్‌లో నెమ్మదించిన స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వేసవిలో అందరుచూడవల్సిన చక్కని తెలుగుమూవీ రంగస్ధలం.
విడుదల తేదీ:30/03/18
రేటింగ్:3.25/5
నటీనటులు: రామ్‌చరణ్,సమంత
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్,మోహన్ చెరుకూరి
దర్శకత్వం: సుకుమార్