నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పనవసరంలేదు. ఇలాంటి మాస్ హీరోకి మంచి కమర్షియల్ దర్శకుడు తోడైతే.. ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ సంక్రాంతికి అలాంటి కాంబినేషనే సందడి చేస్తోంది. బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కింది జైసింహా. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసుండాలంటూ’ సంక్రాంతి సీజన్‌లో కరెక్ట్ టైమింగ్‌తో దూసుకొచ్చిన బాలయ్య ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ:
నరసింహ(బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త(మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే ఆ సమయంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్ చేయడంతో ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ పరిస్ధితులను బాలయ్య ఎలా ఎదుర్కొన్నాడు. బాలయ్య,నయనతారకు ఉన్న సంబంధం ఏంటనేది తెరమీద చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ బాలయ్య నటన, డ్యాన్స్,ఇంటర్వెల్ ట్విస్ట్. జై సింహాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. డైలాగ్‌లు, డ్యాన్స్, యాక్షన్,ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. ముఖ్యంగా అమ్మకుట్టి సాంగ్ సినిమాకే మరో హైలైట్. నయనతార సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. మరో హీరోయిన్స్ నటషా,హరిప్రియల నటన పర్వాలేదనినిస్తుంది. మురళీమోహన్, బ్రహ్మానందం,కాలకేయ ప్రభాకర్,అశుతోష్ రానా,ప్రకాశ్ రాజ్ వారి పాత్రలకు న్యాయం చేశారు. కుంభకోణంలో తీసిన యాక్షన్ సన్నివేశాలు ఫస్టాఫ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ పేలవమైన కామెడీ,క్లైమాక్స్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. చిరంతన్ బట్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీకి వంకపెట్టలేం. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. రోటిన్ కథను అందమైన స్క్రీన్ ప్లేతో చక్కని డైలాగ్‌లు,సెంటిమెంట్‌తో ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు రవికుమార్ వందశాతం సక్సెస్ సాధించాడు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
బాలయ్యకు అచ్చొచ్చిన సింహా టైటిల్‌తో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జై సింహా. బాలయ్య నటన, రవికుమార్ దర్శకత్వం,డైలాగ్స్, సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ కాగా పేలవమైన కామెడీ మైనస్. ఓవరాల్‌గా గత సంవత్సరం గౌతమిపుత్ర శాతకర్ణితో సక్సెస్‌ను సొంతం చేసుకున్న బాలయ్య ఈ ఏడాది జై సింహాతో మరోహిట్ సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.
విడుదల తేదీ:12/01/2018
రేటింగ్:2.5/5
నటీనటులు:బాలకృష్ణ,నయనతార,నటాషా,హరిప్రియ
సంగీతం:చిరంతన్ భట్
నిర్మాత:సీకే ఎంటర్‌టైన్మెంట్స్
దర్శకత్వం:కేఎస్ రవికుమార్