తెలంగాణలో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్,. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు అందించే ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
క్రిశాంక్ ఆరోపణల ప్రకారం, మార్కెట్‌లో సుమారు రూ.8,249 ధర ఉన్న శాంసంగ్ A06 (4GB RAM, 64GB స్టోరేజ్) మొబైల్‌ను ప్రభుత్వం ఒక్కొక్కటి రూ.11,650కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని శాఖ ద్వారా 38,130 ఫోన్ల కోసం సుమారు రూ.54 కోట్ల టెండర్ ఇచ్చినట్లు చెప్పారు.
అయితే తాము ప్రశ్నించగానే, ఫోన్ల కొనుగోలుకు రూ.44 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని, మిగిలిన రూ.10 కోట్లు మెయింటెనెన్స్ కోసం కేటాయించామని ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫోన్లకు మెయింటెనెన్స్ ఖర్చు అనే పేరుతో భారీగా నిధులు మళ్లించారని, ఇది స్పష్టమైన అవకతవక అని విమర్శించారు.
కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను సక్రమంగా వినియోగించకుండా, తక్కువ ఖర్చుతో అవుట్‌డేటెడ్ ఫోన్లు అందించారని కూడా ఆరోపించారు. అంగన్వాడీ మహిళలకే నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదని క్రిశాంక్ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

