ఎమ్మెల్యేల హాజరు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభకు వచ్చి కేవలం సంచకం పెట్టి వెళ్లిపోతున్న కొందరు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
“ఎమ్మెల్యే పదవికి ఇది అన్యాయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాలకు అన్ని సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కఠినంగా ఆదేశించారు. చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలను ప్రస్తావించడం ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు.
ఇకపై హాజరు విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు సభ్యుల హాజరును నమోదు చేస్తామని వెల్లడించారు. హాజరు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సంకేతాలు ఇచ్చారు.
ఈ నిర్ణయం శాసనసభ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ప్రజల సమస్యలపై సమర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

