సీనియర్ ఆటగాళ్లను గౌరవించండి!

1
- Advertisement -

సొంతగడ్డపై తిరుగులేని కోటగా నిలిచిన భారత జట్టు వరుసగా రెండేళ్లలో రెండు సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురికావడంతో టెస్టు క్రికెట్‌లో భారత్ ఆధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలింది. 2025లో న్యూజిలాండ్ 3-0తో విజయం సాధించి సొంతగడ్డపై భారత్‌కు ఉన్న 12 ఏళ్ల విజయపరంపరకు అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకోవడం, వెస్టిండీస్‌పై 2-0తో విజయం సాధించినప్పటికీ, సొంతగడ్డపై వచ్చిన ఈ ఓటములు ఆ విజయాలను నీరుగార్చాయి. టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రహానే మాట్లాడుతూ ఈ ఫార్మాట్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎంతో అవసరమని, వారి లేమి ప్రస్తుతం భారత జట్టులో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

టెస్టు క్రికెట్‌లో 7-8 మంది సీనియర్ ఆటగాళ్లు, 2-3 మంది యువ ఆటగాళ్లు ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న జట్టులో దాదాపు అందరూ కొత్తవారే. సీనియర్ క్రికెటర్లు అసలు కనిపించడం లేదు. టెస్టు క్రికెట్‌కు అనుభవం ఎంతో ముఖ్యం అని రహానే పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, ఛెతేశ్వర్ పుజారా వంటి సీనియర్ క్రికెటర్లు స్వల్ప వ్యవధిలోనే టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడాన్ని రహానే ఈ సందర్భంగా ప్రస్తావించారు.

“నిజం చెప్పాలంటే, అవును నాకు (టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై) భయంగానే ఉంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి 4-5 జట్లు మాత్రమే ప్రస్తుతం టెస్టులలో బలంగా ఉన్నాయి. గత 2-3 ఏళ్లలో నేను గమనించిన దాని ప్రకారం.. సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి వారిని కాపాడుకోవాలి. భారత జట్టు విషయానికొస్తే సీనియర్ ఆటగాళ్లందరూ ఒకేసారి జట్టును వీడటం పెద్ద సమస్యగా మారింది అన్నారు.

ఇటీవలే అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రహానే, మ్యాచ్‌లోని క్లిష్ట సమయాల్లో క్రీజులో నిలబడి పోరాడే ఆటగాళ్ల కొరత ప్రస్తుతం కనిపిస్తోందన్నారు. ఏ జట్టు పేరునూ నిర్దిష్టంగా ప్రస్తావించకుండా ఇది అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఒక ట్రెండ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా నేను టెస్టు క్రికెట్ ఆడకపోవడంతో ఇంట్లోనే కూర్చుని భారత జట్టు సొంతగడ్డపై మ్యాచ్‌లు ఓడిపోతుండటం చూశాను. టెస్టు క్రికెట్‌కు పట్టుదల, క్యారెక్టర్, మానసిక బలం చాలా అవసరం. కష్ట సమయాల్లో క్రీజులో నిలబడి వికెట్ కాపాడుకోవడం ముఖ్యం. కానీ ఈ రోజుల్లో జట్లు ఆ పని చేయడం లేదు అని చెప్పారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

రెడ్-బాల్ (టెస్టు) క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన పడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) క్రికెట్‌లో భారత్ ఇప్పటికీ అత్యంత బలమైన జట్టుగానే ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్‌లతో పాటు 2025 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది.

- Advertisement -