కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు కమిషన్ కార్యకలాపాలను నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తీరును సవాల్ చేస్తూ.. కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేశారు.
కమిషన్ విచారణలో సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని పిటిషనర్లు తమ వాదనలను వినిపించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం, పిటిషనర్ల వాదనతో ఏకీభవించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే విధించింది.
కమిషన్ సమర్పించిన లేదా సమర్పించబోయే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి శిక్షాత్మక లేదా ఇతర చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.కాళేశ్వరంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భావించిన ప్రస్తుత ప్రభుత్వానికి ఈ తీర్పు కొంత ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.కేసీఆర్, హరీశ్ రావులతో పాటు అధికారులైన స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషిలకు కూడా ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించింది.
ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

