ఇక మెబైల్‌ బిల్‌ మోత..!

224
Reliance Jio's rate hike may be bad news for your mobile bill
- Advertisement -

ఫ్రీ కాల్స్,ఫ్రీ డేటాతో సంచలనం సృష్టించిన జియో ఆరంభంలో ఫోన్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్ లు.. అన్నీ ఉచితం. ఆ తర్వాత ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే భారీ తక్కువ ధరలకే ఆకర్షణీయమైన 4జి ప్లాన్లు. ఇది జియో తన సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించుకోవడానికి అనుసరించిన వ్యూహం. దీనికి ప్రత్యర్థి టెలికాం కంపెనీలు చిత్తయిపోయాయి. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. జియో మూలంగా కొన్ని కంపెనీలు విలీనబాట పట్టాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు జియో తన ప్లాన్ల ధరలను పెంచడంపై దృష్టిసారించింది. ఇటీవలే కొన్ని ప్లాన్ల ధరలను 15-20 శాతం వరకు పెంచింది. దీంతో ఇప్పటిదాకా ఆదాయం పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది.
Reliance Jio's rate hike may be bad news for your mobile bill
ఎందుకంటే ఆయా కంపెనీలు కూడా తమ టారిఫ్ లను పెంచుకునే అవకాశం లభించనుంది. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా వంటి టెలికాం సంస్థలు తమ ప్లాన్ల ధరలను పెంచాలన్న యోచనలో ఉన్నట్టు పరిశ్రమవర్గాల ద్వారా తెలుస్తోంది. ధరల పెరుగుదల టెలికాం కంపెనీలకు సానుకూలమైన అంశమని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ యుబిఎస్‌ అంటోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జియో 6,147 కోట్ల రూపాయల రాబడిపై 270.59 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకన్నా భిన్నంగా ఉండటం విశేషం. పెద్ద ఎత్తున కస్టమర్లను సంపాదించుకోవడం వల్ల కంపెనీకి బాగా కలిసి వచ్చింది. వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో జియో మంచి రాబడులను నమోదు చేసింది. రానున్న కాలంలో కస్టమర్ల నుంచి వచ్చే రాబడి మరింతగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

Reliance Jio's rate hike may be bad news for your mobile bill

గత సెప్టెంబర్‌ చివరినాటికి జియో కస్టమర్ల సంస్థ 13.9 కోట్ల స్థాయిలో ఉంది. స్మార్ట్‌ఫోన్లు, జియో ఫోన్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.2 కోట్ల మంది కొత్త కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని వల్ల వచ్చే మార్చినాటికి కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 18.1 కోట్లకు చేరుకోవచ్చు. 2019 మార్చినాటికి 20.5 కోట్ల కస్టమర్లను సంపాదించుకోవాలన్న యోచనలో జియో ఉంది. ఇదే సమయంలో కస్టమర్ల నుంచి వచ్చే రాబడిని పెంచుకుని ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్లాన్ల ధరలను పెంచడంపై దృష్టిసారిస్తోంది.

- Advertisement -