CM KCR:వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్

92
- Advertisement -

విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ విషయంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న అనంతరం విఆర్ఏ జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్ కు ఆహ్వానించి సీఎం వారితో చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తు చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం అధికారులకు సూచించారు. మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్ పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. ఈ విషయంలో వీఆర్ఏ లు సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, విఆర్ఏ జెఎసి ప్రతినిధులకు సూచించారు. విఆర్ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.

Also Read:CMKCR:నిఖత్‌కు రూ.2కోట్లు…

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ జి.జగదీష్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, సెక్రటరీలు శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీ భూపాల్ రెడ్డి, విఆర్ఎ జెఎసి ప్రతినిధులు శ్రీ రమేష్ బహదూర్, శ్రీ వెంకటేష్ యాదవ్, శ్రీ మాధవ నాయుడు, శ్రీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.కేబినెట్ లో నిర్ణయం తీసుకొని తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రికి విఆర్ఏ జెఎసి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:Harishrao:ఎన్నడూ లేని విధంగా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -