ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. చెన్నైపై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 132 పరుగులు చేసింది. ఆర్సీబీ 4వ విజయాన్ని నమోదు చేసుకోగా చెన్నై 5వ ఓటమిని మూటగట్టుకుంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు వాట్సన్ 1,డుప్లెసిస్ 8 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. అయితే తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు రాయుడు,జగదీశన్. మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం జగదీశన్ 33 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగారు.
తర్వాత వచ్చిన ధోని 10,కర్రాన్ డకౌట్‌గా వెనుదిరగడంతో సీఎస్‌కే కష్టాల్లో పడింది. అయితే రాయుడు క్రీజులో ఉండటంతో చెన్నై ఆశలు సజీవంగా ఉన్న రాయుడు కూడా 37 పరుగులు చేసి క్లీన్ బోల్డ్‌గా వెనుదిరగడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. ఆర్సీబీ బౌలర్లలో మోరీస్ 3,ఉదాన 1,వాషింగ్టన్ సుందర్ 2,చాహల్ 1 వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభంలోనే బెంగళూరుకు ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్ బోల్డ్‌గా ఔటయ్యాడు. అయితే తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు కోహ్లీ, పడక్కల్. పడక్కల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు.
తర్వాత డివిలియర్స్ 0,వాషింగ్‌టన్ సుందర్ 10 పరుగులు చేసి వెనుదిరిగారు. ఓ దశలో బెంగళూరు 150 దాటుతుందా అనే సందేహం నెలకొనగా విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. కోహ్లీ(90 నాటౌట్: 52 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) ఆకట్టుకోగా చివరలో శివమ్ దూబే 22 పరుగులు చేయడంతో బెంగళూరు 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కోహ్లీ వీరవిహారం చేసి ఫామ్‌లోకి రావడం ఆర్సీబీకి శుభపరిణామం. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్(2/40) రెండు వికెట్లు తీయగా.. శామ్ కరన్, దీపక్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.