IDFC ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో సోమవారం మార్కెట్లలో ఆ బ్యాంక్ షేర్ ప్రధాన చర్చగా మారింది. హర్యానా ప్రభుత్వ ఖాతాకు సంబంధించిన ఈ మోసం చండీగఢ్ శాఖలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో బ్యాంక్ షేర్ ధర 15% కంటే ఎక్కువ పతనమై, పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పరోక్షంగా బ్యాంకుకు మద్దతుగా నిలిచారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి వ్యవస్థాపరమైన సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో గవర్నర్‌ను IDFC ఫస్ట్ బ్యాంక్ పరిస్థితిపై ప్రశ్నించారు.
మేము వ్యక్తిగత బ్యాంకులపై వ్యాఖ్యానించము. వ్యవస్థాపరమైన ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు. ఈ ప్రకటనతో బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలు అవసరం లేదని సంకేతం ఇచ్చారు.రూ.590 కోట్ల మోసం బయటపడటంతో IDFC ఫస్ట్ బ్యాంక్‌పై పెట్టుబడిదారుల నమ్మకం తాత్కాలికంగా దెబ్బతింది. అయితే, అశికా సహా పలు బ్రోకరేజీ సంస్థలు ఈ మోసం ప్రభావం బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై తీవ్రంగా ఉండదని అభిప్రాయపడ్డాయి. మొత్తం నష్టం భరించాల్సి వచ్చినా, బ్యాంక్ ఆర్థిక స్థితి దెబ్బతినదని పేర్కొన్నాయి.
ఈ రోజు నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌లో బ్యాంక్ యాజమాన్యం కొంతమంది ఉద్యోగులు కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో ఇది పాఠ్యపుస్తకాల్లో ఉండే తరహా మోసంగా పేర్కొంది.
Also Read:దేవుడికి మహాపచారం..అసెంబ్లీలోనే బయటపెడతాం!
IDFC ఫస్ట్ బ్యాంక్ సీఈఓ వి. వైద్యనాథన్ మాట్లాడుతూ…ఈ మోసానికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టము అని హెచ్చరించారు.

