తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించిన సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న చిత్రం `రావోయి.. మాఇంటికి`. బ్లాక్ పెప్పర్ స్ర్కీన్స్ పతాకంపై డాలీభట్ నిర్మిస్తున్నారు. శ్రీధర్, కావ్యాసింగ్, అవంతిక హరో, హీరోయిన్లగా నటిస్తున్నారు. సాకేత్ సాయిరామ్ కీలక పాత్ర పోషిస్తూ సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి సీడిని ఆవిష్కరించి..సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందజేశారు.
అనంతరం భరద్వాజ మాట్లాడుతూ, ` సాకేత్ నా చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.మంచి మ్యూజిక్ డైరెక్టర్. చాలా సినిమాలకు మ్యూజిక్ అందించారు. గానీ, అనుకున్నంత గుర్తింపు రాలేదు. థ్రిల్లర్ కామెడీ నేపథ్యంతో సినిమా తెరకెక్కించాడు. బాగా వచ్చిందనుకుంటున్నా. పాటలు, సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, `సాకేత్ మంచి టెక్నీషియన్. అతని బాణీలు చాలా కొత్తగా వినసొంపుగా ఉంటాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆశించిన గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో అన్ని విధాలుగా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నా. టైటిల్ బాగుంది. టైటిల్ లోగో చూస్తుంటే క్రైమ్ స్టోరీ లోనే కామెడీని హైలైట్ చేస్తూ తెరకెక్కించినట్లున్నారు. యువతతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది` అని అన్నారు.
దర్శకుడు సాకేత్ సాయిరాం మాట్లాడుతూ, ` 30 శాతం థ్రిల్లర్, 70 శాతం కామెడీ అంశాలతో తెరకెక్కించిన సినిమా ఇది. కాన్సెప్ట్ ను నమ్ముకుని తెరకెక్కించాం. కథే హీరో. ప్రతీ పాత్రలోనూ వైవిథ్యం ఉంటుంది. నటీటనులంతా చక్కగా నటించారు. మొత్తం 5 పాటలున్నాయి. అన్ని వేటికవే ప్రత్యేకంగా డిఫరెంట్ జోనర్ లో ఉంటాయి. సినిమా చాలా క్వాలిటీగా ఉంటుంది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
హీరో శ్రీధర్ మాట్లాడుతూ, ` కామెడీ సినిమా అయినా ప్రతీ పాత్రలోనే వేరియేషన్స్ ఉంటాయి. నా పాత్రలో రెండు, మూడు వేరియషన్స్ కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు` అని అన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ, ` కొత్త వాళ్లను ప్రోత్స హిస్తూ సాకేత్ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రొటీన్ కామెడీ సన్నివేశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది` అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె. దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ` సినిమా కష్టపడి..ఇష్టపడి తెరకెక్కించాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
ఈ వేడుకలో అమృత్ పులి, డి.కె గోయిల్ తదితరులు పాల్గున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ‌్రీధర్, ఛాయాగ్రహణం:వై. రామాంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, ఎడిటింగ్: గోపీ సిందం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. దిలీప్ కుమార్ రెడ్డి, నిర్మాత: డాలీ భట్, కథ, కథనం, సంగీతం, దర్శకత్వం:సాకేత్ సాయిరామ్.