డ్రగ్స్ కేసు విచారణ లో భాగంగా పదో రోజు విచారణకు రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరావు సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న రవితేజ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన అధికారులు ఇవాళ ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు నుంచి వివరాలను రాబట్టనున్నారు. కెల్విన్ నుంచి సినీ ప్రముఖులకు శ్రీనివాసరావే డ్రగ్స్ సరఫరా చేసేవాడని సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉండటంతో ఆ దిశగా ప్రశ్నలను సందించేందుకు సిద్దమయ్యారు.
ఈ కేసులో అధికారుల బృందం ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్, తరుణ్, కెమెరామెన్ శ్యామ్ కేనాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, రవితేజను వివిధ కోణాల్లో ప్రశ్నించి..కేసుకు సంబంధించి పలు వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. ముమైత్ ఖాన్ రక్తం గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారనీ, ప్రస్తుతం అవసరంలేదని తాము చెప్పినట్టు సిట్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా, నిన్న జరిగిన విచారణలో రవితేజ తనకు, డ్రగ్స్‌కు ఎటువంటి సంబంధం లేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పేర్కొన్నాడు. తాను బ్యాంకాక్ వెళ్లేది మంచి ఆలోచనల కోసమే తప్ప డ్రగ్స్ తీసుకునేందుకు కాదని స్పష్టం చేశాడు. అయితే చిన్నచిన్న పార్టీలు సహజమేనని అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది.
తాను డ్రగ్స్ కోసమే బ్యాంకాక్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు సరికావని టాలీవుడ్ నటుడు రవితేజ తనను విచారించిన సిట్ అధికారుల ఎదుట స్పష్టం చేశాడు. ఆ ప్రచారంలో నిజం లేదని, క్రియేటివిటీ, చక్కని ఆలోచనల కోసమే బ్యాంకాక్, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తుంటామని పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో నిందితులైన జీషన్, కెల్విన్‌ల ఫోన్ కాల్ డేటాలో మీ ఫోన్ నంబరు ఎందుకు ఉందన్న ప్రశ్నకు.. వారెవరో తనకు తెలియదని, వారి కాల్ లిస్ట్‌లో తన నంబరు ఉండడం తప్పెలా అవుతుందని అధికారులను తిరిగి ప్రశ్నించాడు.