‘ఖిలాడి’ విషయంలో రవితేజ అసహనం..!

27

‘క్రాక్‌’ సినిమా విజయంతో దూకుడు మీదున్న మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’.రమేశ్ వర్మ ఈ సినిమా రూపొందిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి. రవితేజ 67వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.

ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. కానీ ఈ సమయంలోనే ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా చెబుతున్నారు. షెడ్యూల్స్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం రవితేజను ఇబ్బందికి గురిచేస్తోందట. వరుస సినిమాలను ఒప్పేసుకుని ఉన్న రవితేజకు, ప్లానింగ్ లోపం అసహనాన్ని కలిగించిన కారణంగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయిందని సినీ వర్గాల్లో గుస గుస వినిపిస్తోంది.

‘ఖిలాడి’ కోసం తాను ముందుగా ఇచ్చిన డేట్స్ పూర్తికావడంతో, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సెట్స్ పైకి వెళ్లిపోయాడని చెప్పుకుంటున్నారు. రవితేజతో మాట్లాడి .. మిగతా షూటింగును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో ‘ఖిలాడి’ దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు.ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.