టీమిండియా హెడ్ కోచ్ నియామకంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. హెడ్ కోచ్ పదవిలో రవిశాస్త్రిని నియమించారు. అనిల్ కుంబ్లే స్థానంలో కోచ్ గా ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. అందరు ఉహించినట్లుగానే కెప్టెన్ కోహ్లి సూచించిన వ్యక్తికే బీసీసీఐ పట్టం కట్టింది. గతంలో రవిశాస్త్రిని కాదని కుంబ్లేకు కోచ్ పదవి కట్టబెట్టిన బీసీసీఐ పెద్దలు తాజాగా మళ్లీ రవిశాస్త్రికే ఆ బాధ్యతలు అప్పజెప్పడం విశేషం. 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బీసీసీఐ హడావిడి చేసినా… రవిశాస్త్రి అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ(సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో 55 ఏళ్ల రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా ఎంపికయ్యారు. మొత్తంగా ఆరుగురు అభ్యర్ధులు ఇంటర్య్వూలు చేయగా రవిశాస్త్రి వైపు సీఏసీ మొగ్గు చూపింది.
టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పని చేసిన సమయంలో భారత్.. ఆస్ట్రేలియాలో తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ ను ఖాతాలో వేసుకుంది. టీ 20 సిరీస్ ను 3-0 తో గెలిచింది. దాంతో పాటు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది భారత జట్టు. మరొకవైపు 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్‌ల్లో సైతం సెమీస్ కు చేరుకుంది.
1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిథ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లు ఆయన ఆడారు.టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రి పనిచేశారు.