తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా రసమయి

89
kcr cm

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.తనను సాంస్కృతిక సారథి చైర్మన్ గా పునర్నియామకం చేయడం పట్ల కృతజ్జతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను ప్రగతి భవన్ లో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్జతలు తెలిపారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని రసమయి అందుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, రసమయిని అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి, వారికి ఉద్యోగాలిచ్చిందని సిఎం అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ, స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదన్నారు.

దేశానికే ఆదర్శంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు మరింతగా చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ గా రెండోసారి నియామకమైన రసమయి కృషి చేయాలని, సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ , ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.