బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే వివిధ క్రీడాకారుల జీవితాలు సినిమాల రూపంలో తెరకెక్కగా భారత దేశానికి మొట్ట మొదటి వరల్డ్ కప్ ని అందించిన లెజండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదలకు సిద్దం కాబోతుంది. సల్మాన్ తో బజరంగీ భాయీజాన్ – ట్యూబ్ లైట్ వంటి సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ అరుదైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న కపిల్‌దేవ్ బయోపిక్ ‘83’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 30న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సినిమా టీం ప్రపంచకప్ అందుకున్న ఆటగాళ్లను ఆహ్వానించింది. అప్పుడే సినిమా పేరును ‘83’గా ప్రకటించిన చలనచిత్ర బృందం సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కపిల్ బయోపిక్ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది మధ్య నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ‘ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.. అలాగే సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలతో పాటు పరుగుల రాణి పీటీ ఉష జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పిటి ఉషగా ప్రియాంక చోప్రా నటించనుంది. ఇక త్వరలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో పాటు స్టార్ బ్యాడ్మింటర్ పివి సింధు బయోపిక్ కూడా తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరితో పాటు సైనా నెహ్వాల్,సింధు వంటి ఆటగాళ్లను అందించిన పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.