ఫిక్సింగ్ భూతం క్రికెట్‌ని పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫిక్సింగ్ పాల్పడ్డ క్రికెటర్లు కొంతమంది జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటుండగా తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ సారథి అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా చేతిలో శ్రీలంక ఓటమి పాలవ్వడంపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. ముంబయిలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో లంక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం తనను వేదనకు గురిచేసిందని రణతుంగ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పెట్టారు.
మ్యాచ్ జరిగినప్పుడు తాను కామెంటరీ చేస్తున్నానని ఓడిపోయినప్పుడు చాలా బాధ కలిగిందన్నారు. అప్పుడే తనకు సందేహం వచ్చిందన్నారు. ప్రస్తుతానికి తాను ఎవరి పేర్లనూ బయటపెట్టడం లేదని అయితే ఏదో ఒక రోజు కచ్చితంగా బహిర్గతం చేస్తానన్నారు. పాకిస్తాన్‌లో సరైన భద్రత లేనప్పటికీ 2009లో లంక జట్టును అక్కడికి పంపించడంపై విచారణ జరపాలని సంగక్కర డిమాండ్ చేయడంతో రణతుంగ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఓటమిని తెరపైకి తేవడం గమనార్హం.
ఆ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)లను తక్కువ పరుగులకే అవుట్ చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా శ్రీలంక బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ పేలవంగా మారడంతో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే రణతుంగ ఆరోపణలు పనికిమాలినవిగా నాటి వరల్డ్‌కప్ భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రా కొట్టిపారేశారు. అతడి ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. రణతుంగ ఆరోపణలు నన్ను ఆశ్చర్యపరిచాయని…ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాడు. ఇలాంటి ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరంలేదని నాటి భారత జట్టు సభ్యుడు నెహ్రా అన్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్‌కప్ టైటిల్ విజయాన్ని నేను ప్రశ్నిస్తే భావ్యంగా ఉంటుందా? అందువల్ల రణతుంగ వ్యాఖ్యల్లోకి నేను వెళ్లదలుచుకోలేద’ని నెహ్రా అన్నాడు.