దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటిస్తోన్న `అరణ్య`ను ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సహా హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన పని వల్ల భూమి నది కోత నుండి పరిరక్షింపబడింది. జంతువులు ఉండే ప్రాంతాలను, ప్రకృతిని మనం మార్చాలని అనుకున్నప్పుడు వాటికేం ప్రమాదం ఉండదు. నేను పదేళ్లకు పైగా సినిమాల్లో నటించాను. సినిమాల్లో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ అరణ్య సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను.
ప్రభుతో సినిమా చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ విని నేను క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి నాకు అరు నెలల సమయం పట్టింది. థాయ్‌లాండ్ షెడ్యూల్‌కి వెళ్లినప్పుడు నాకు అరణ్య పాత్రేంటో తెలిసింది. చాలా రోజుల పాటు నాకు కో యాక్టర్ లేకుండా నటించాల్సి వచ్చింది. మొబైల్స్ కూడా లేదు. దీంతో నేనెవరు? నేనెంటి? అనే విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్‌కి రుణపడి ఉంటాను.
మూడు లాంగ్వేజెస్‌లో సినిమా చేయడం ఎంతో కష్టం. తెలుగు, తమిళంలో సులభంగానే చేశాను. కానీ.. హిందీలో చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్రభు టేకింగ్ వేరే రిథమ్‌లో ఉంటుంది. మనకు ఇచ్చిన డైలాగ్ పేపర్‌కి, సెట్స్‌కి వెళ్లేటప్పటికీ ఎంతో మార్పు ఉంటుంది. చాలా డీటెయిల్డ్‌గా తెరకెక్కించారు. వ్యక్తిగా, నటుడిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది. త్వరలోనే మిగతా వీడియోలు, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం“ అన్నారు.