మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పోటీ చేసే నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ . కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, మాయా చింతామణి ఇవ్నాటే, రామ్‌రావ్ వాడ్కూటేలకు టికెట్లు కేటాయించింది. మంగళవారం వినోద్ తావ్డే మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం బీహార్ ఇన్‌చార్జ్‌గా ఉన్న తావ్డే, ఏప్రిల్‌లో పదవీకాలం ముగియనున్న మహారాష్ట్రకు చెందిన ఏడు స్థానాల్లో ఒకదానికి పోటీ చేయనున్నారు.
మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు బీజేపీ దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ నుంచి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్‌లను రంగంలోకి దింపింది. అసోంలో తేరాష్ గోవల్లా, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఒడిశా నుంచి రాష్ట్ర యూనిట్ చీఫ్ మన్మోహన్ సామల్‌తో పాటు సుజీత్ కుమార్‌కు టికెట్ ఇచ్చారు.
హర్యానాలో 90 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో సంజయ్ భాటియా ఎగువ సభకు ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నాల్ మాజీ ఎంపీ అయిన భాటియా పార్టీ తనలాంటి సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
బీహార్‌లో బ్యాంకిపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబీన్, గతంలో ససారం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన శివేశ్ కుమార్‌లను కూడా పార్టీ నామినేట్ చేసింది. 45 ఏళ్ల నబీన్ జనవరిలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, బీజేపీలో మూడో తరం నాయకత్వం ఎదుగుదలకు సంకేతంగా నిలిచారు.

