డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రాం రహీం సింగ్ తరువాత కీలకమైన వ్యక్తి హనీ ప్రీత్ సింగ్. గుర్మీత్ తీసిన ‘ఎంఎస్‌జీ ది వారియర్, లైన్ హార్ట్’ సిరీస్ సినిమాల దర్శకత్వ బాధ్యతలతో పాటు నటన బాధ్యతలు కూడా హనీ ప్రీత్ తీసుకుంది. ఈ సినిమాల్లో 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్ లో వేసుకుంది. అంతే కాకుండా తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్ ఎడిటర్ నని, రచయితనని, అన్నింటికన్నా సింగ్‌కు గొప్ప కూతురునని చెప్పుకుంటుంది.
గుర్మీత్‌కు సీబీఐ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో సిర్సాలోని డేరా సచ్ఛా సౌధాకు గుర్మీత్ రాం రహీం సింగ్ వారసురాలిగా హనీ ప్రీత్ సింగ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆమె గురించి బాడీ గార్డ్ బియాంత్ సింగ్ సంచలన విషయాలు మీడియాకు చెప్పాడు. గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా పక్కనే నిత్యం కనిపించే హనీప్రీత్ అతనిని తండ్రిగా పేర్కొంటుంది కానీ, వారిది ఆమోదయోగ్యమైన సంబంధం కాదని చెప్పారు. వారిద్దరూ చేసేది సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అన్నారు. వాస్తవానికి ఆమె పేరు ప్రియాంక తనేజా అని ఆయన చెప్పారు.
1999లో సచ్చా డేరా ఫాలోవర్ విశ్వాస్ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాక ఆమె తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకుందని చెప్పాడు బియాంత్ సింగ్. భర్తతో పాటు ఆమె కూడా తరచుగా ఆశ్రమానికి వస్తూ ఉండేదని.. అంతేకాక ఆమె భర్త నమ్మకమైన భక్తుడు కావడంతో, ఆయనకు ఎప్పుడైన ఆశ్రమానికి వచ్చే వీలుండేదని తెలిపాడు. ఆయన తన భార్యతో వచ్చేవారని, గార్డులు కూడా వారిని ఆపేవారు కాదని ఆయన అన్నారు. అయితే ఒకరోజు తాను గుర్మీత్ ఆశ్రమానికి వచ్చేసరికి… తన భార్య గుర్మీత్ బెడ్ రూమ్ లో, గుర్మీత్‌తో అభ్యంతరకర స్థితిలో కనిపించిందని విశ్వాస్ గుప్తానే గతంలో మీడియాకు కూడా తెలియజేశారని బాడీగార్డ్ తెలిపాడు.
దీంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి, మీడియా ముందు బాబా గుట్టు రట్టు చేశారని చెప్పాడు. ఈ క్రమంలో గుర్మీత్ హనీ ప్రీత్ సింగ్ చేత తన అత్తమామలు కట్నం కోసం తనను వేధిస్తున్నారని కేసు పెట్టించారని గుర్తు చేశారు. ఆ తరువాత తన పలుకుబడితో వారిపై మరిన్ని కేసులు పెట్టి, మానసికంగా వారిని హింసించారని, తరువాత భరణం పేరుతో వారి ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారని బియాంత్ సింగ్ తెలిపారు. ఇప్పుడు హనీ ప్రిత్ సింగ్ గా మారి, గుర్మీత్ దత్త పుత్రికగా సిర్సాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. అందుకోసమే జైల్లో కూడా ఆమె తనతో ఉండాలని బాబా కోరారని గుర్తు చేశారు.