అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. గుర్మీత్ ప్రస్తుతం జైలులో ఉండగా ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసు కస్టడీలో ఉంది. అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో చోటుచేసుకున్న అల్లర్లకు ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ కారణమని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో.. డేరాబాబా కేసు, పంచకుల అల్లర్లపై హర్యానా బీజేపీ ఎమ్మెల్యే కుల్వంత్ బాజీగార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచకుల అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న డేరాబాబా శిష్యురాలు, వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. హనీప్రీత్ సహా పంచకుల అల్లర్ల కేసులో అరెస్టయిన డేరాబాబా అనుచరులందర్నీ వెంటనే విడుదల చేయాలని కోరారు.
వాళ్లంతా అమాయకులు.. బూటకపు కేసులు బనాయించి వారిని అరెస్టు చేశారు… అని ఎమ్మెల్యే కుల్వంత్ వ్యాఖ్యానించారు. కాగా ఆయనకు మరో స్వతంత్ర ఎమ్మెల్యే జై ప్రకాశ్ మద్దతుగా నిలవడం విశేషం. బాబా రామ్‌పాల్, డేరాచీఫ్ గుర్మీత్ సింగ్ తదితరులపై కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం కోర్టు పరిథిలో ఉందనీ… దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడడానికి లేదని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.