మెర్సల్‌ని బ్లాక్ బస్టర్‌ చేసిన జీఎస్టీ,బీజేపీ

209
GST boosts Mersal
- Advertisement -

మెర్సల్…ఇప్పుడు కోలీవుడ్‌ని,బీజేపీని షేక్ చేస్తోంది. పది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదల రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…పొలిటికల్ కాంట్రవర్సీతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొచ్చిన జీఎస్టీ, డిజిటల్ ఇండియాతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దుస్ధితిని ముఖ్యంగా గొరఖ్‌పూర్‌ ఘటనలపై రాసిన డైలాగ్‌లు దివాళి బాంబుల్లాగా పేలాయి. ప్రజలు తమకున్న అక్కసును ఈ సినిమా ద్వారా తీర్చుకుంటున్నారు.

ఉచిత వైద్యం, ప్రభుత్వ ఆస్పత్రులు దుస్ధితి, దేశంలో కట్టాల్సింది దేవాలయాలు కాదు ఆస్పత్రులు అంటూ విజయ్ వేసిన పంచ్‌ డైలాగ్‌లు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ డైలాగులతో ఇబ్బందివస్తుందని భావించిన ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మెర్సల్‌పై ముప్పేటదాడికి దిగారు. హీరో విజయ్‌తో పాటు నిర్మాతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. సినిమాలోని డైలాగ్‌లను తొలగించి మళ్లీ సెన్సార్ చేయాలని  ఒత్తిడితీసుకొచ్చారు.

ఫలితంగా అప్పటివరకు కోలీవుడ్‌కే పరిమితమైన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మెర్సల్  డైలాగ్‌లకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేశాయి. సినిమా పూర్తి కావడానికి తన ఆస్తులను అమ్ముకున్న నిర్మాతకు రెట్టింపు వసూళ్లను తెచ్చిపెట్టాయి. ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి…డబుల్ సెంచరీ  వైపుగా దూసుకుపోతోంది మెర్సల్.

జీఎస్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం…దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు బీజేపీ నేతల నోటి దురుసుతనం తోడవటంతో విజయ్ మెర్సల్‌కి తిరుగలేకుండా పోయింది. ఓ వైపు  సినిమాలోని డైలాగ్‌లను తొలగించాలని జాతీయ స్ధాయిలో  ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమిళనాడు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే కోలీవుడ్‌ మాత్రం విజయ్‌కి అండగా నిలిచింది. అగ్రహీరోలు కమల్ హాసన్‌,విశాల్‌తో పాటు కాషాయ పార్టీకి  అనుకూలంగా ఉండే రజనీకాంత్ సైతం మెర్సల్‌ సినిమాకు మద్దతుగా నిలిచారు. బాగుందని కితాబిచ్చారు. చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు.

దీంతో మరింత ఇరకాటంలో పడ్డ బీజేపీ నేతలు  విశాల్, హీరో విజయ్‌ కంపెనీలపై జీఎస్టీ టాక్స్‌ పేరిట రైడ్‌లు నిర్వహించారు. ఇక విజయ్‌పై ఏకంగా మతం రంగు రుద్దే ప్రయత్నం చేశారు. అయితే, బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మోడీ తెచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుపై క్షేత్రస్ధాయిలో అసహనం వ్యక్తమవుతున్న తరుణంలో  కాషాయ దళం వేసిన ఎత్తుగడ ఫలించడం సంగతి  అటుంచితే ఆపార్టీకి జరగరాని నష్టాన్నే మిగిల్చింది.

మాజీ సీఎం జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించి  వచ్చే ఎన్నికల్లో  తమిళనాడులో పాగా వేద్దామనుకున్న కమలనాథుల గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటివరకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతు వస్తున్న మోడీ, షా జోడికి మెర్సల్‌తో దిమ్మతిరిగినట్లైంది.  కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌ సైతం మెర్సల్‌ సినిమాను అడ్డుకోవడాన్ని తప్పుబట్టడమే కాదు తమిళుల ఆత్మగౌరవంతో పోల్చి కమలనాథులను మరింత ఇరకాటంలోకి నెట్టేశాడు. మొత్తంగా జీఎస్టీ,బీజేపీతో ప్రజలంతా బాధపడితే మెర్సల్ సినిమాని హిట్ చేసింది. విజయ్ ఇమేజ్‌ని మరింత పెంచింది.

- Advertisement -