‘దైర్యం ముందు పుట్టి రౌడీలు తర్వాత పుడతారు. చావుభయమున్న ఎవ్వడూ రౌడీ అవలేడు.’ ఇది వర్మ తీసిన ఓ సినిమాలోని డైలాగ్. అయితే ఇక్కడో జిమ్మిక్కు చేస్తే మాత్రం ఆ డైలాగ్‌లోంచే వర్మ పుట్టుకొస్తాడు. వర్మ ముందు పుట్టి.. కాంట్రవర్శీ తర్వాత పుట్టింది.
అందుకే వర్మకు సంబంధించినంత వరకూ..వర్మ ఏది మాట్లాడినా అది కాంట్రర్శే..! కాంట్రవర్శీ మాట్లాడడానికి భయపడే ఎవ్వరూ పబ్లిసిటీ సంపాధించుకోలేరని వర్మ అభిప్రాయమేమో..అందుకే కాంట్రవర్శీ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు వర్మ.
ఇవన్నీ పక్కనపెడితే..ఇప్పుడు వర్మ టాపిక్ ఎందుకనేగా మీ డౌట్..? ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూకి హాజరైన వర్మ తనదైన స్టైల్లో స్పందిచాడు. ఇప్పటికే తెలుగు.. హిందీ భాషల్లో రామ్ గోపాల్ వర్మకి దర్శకుడిగా ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన ధోరణి కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తే .. మరికొంతమందికి ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. పాతికేళ్ల కెరియర్లో వ్యక్తిత్వం పరంగా, ప్రజల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పరంగా, మీ గుర్తింపు పెరిగింది అనుకుంటున్నారా? లేదంటే తగ్గింది అనుకుంటున్నారా? అనే ప్రశ్న వర్మాకి ఎదురైంది. అయితే..సక్సెస్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుందని చెప్పారు వర్మ.
సక్సెస్ విషయంలో అవతలవారు చూసే కోణం .. తాను చూసే కోణం ఒకేలా ఉండకపోవచ్చని, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకూ ఆ రోజు ఏమేం చేయాలని ఫీలవుతామో.. అవి చేయగలిగితే సక్సెస్ అని చెప్పారు.
అభిరుచికి తగిన విషయాల్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే సక్సెస్ అనుకుంటే, తన 6వ యేట నుంచి ఇప్పటివరకూ తాను సూపర్ సక్సెస్ ఫుల్ అని స్పష్టం చేశారు. ఇక గుర్తింపు విషయానికి… ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే, తాను ఎప్పుడూ అలాగే వుంటాను అని తేల్చి చెప్పారు వర్మ.