రామ్‌గోపాల్ వర్మ..ఓ సంచలన దర్శకుడు. ఈయనకు మరో పేరు కూడా ఉంది..వివాదాలకు పెట్టింది పేరు రాంగోపాల్ వర్మ అని. వర్మ ఎక్కువగా తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడనేది వాస్తవం. అయితే వర్మ ఏది చేసినా అది సంచలనమే. ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం.
ట్విట్టర్ వేదికగా ఎంతో మంది ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ ఇటీవలే ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. ట్విట్టర్ నుంచి బయటకు రావడమే తరువాయి.. ‘గన్స్ అండ్ థైస్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఇదిలా ఉంటే..తాజాగా వర్మ గురించి సంచలన విషయం తెలిసింది.
బాలీవుడ్ జర్నలిస్ట్, నిర్మాత విధూ వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా, తాను నడిపే ‘ఫిల్మ్ కంపానియన్’ వెబ్ సైట్ కంటెంట్ కోసం దర్శకుడు రాంగోపాల్ వర్మను సంప్రదించగా, దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం వచ్చిందట. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలు సత్య, కంపెనీ తదితరాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను ఇస్తే, వెబ్ సైట్ లో పెట్టుకుంటానని అనుపమ అడుగగా, తాను ఎటువంటి స్క్రిప్ట్ లు లేకుండానే ఆ చిత్రాలను తీశానని వర్మ చెప్పాడట. దీన్ని అనుపమ నమ్మలేకపోగా, తన తల్లిపై, ఎంతో ఇష్టపడే హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ పై ఒట్టేసి చెబుతున్నానని, స్క్రిప్ట్ తయారు చేసుకోవడం మొదలు పెట్టిన తరువాతే తనకు పరాజయాలు మొదలయ్యాయని అన్నాడట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసిన అనుపమ, ఇది వర్మ మార్క్ క్లాసిక్ ఆన్సర్ అంటూ కితాబిచ్చారు.
An instant #RamGopalVarma classic! pic.twitter.com/EFAWurBAYT
— Anupama Chopra (@anupamachopra) August 21, 2017