వంగవీటి సినిమా తీసి బెజవాడలో అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ.. ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన ఎన్టీ రామారావుపై సినిమా తీయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ పాటను కూడా విడుదల చేశారు వర్మ. అయితే..ఈ సంచలన దర్శకుడు తాజాగా వివాదాస్పద ప్రకటన చేశాడు. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్మ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
ఈ సినిమా తీయడానికి చేసిన పరిశోధన పూర్తయిందని, ఈ మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత.. లక్ష్మీపార్వతి చెప్పిన నిజానిజాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ బయోపిక్కు బదులుగా.. ఆయనను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిన తెర వెనుక బాగోతాలను సినిమాగా తీయనున్నట్లు వర్మ తెలిపాడు. ఈ సినిమా తీయడానికి తానెంతో కుతూహలంగా ఉన్నట్లు కూడా చెప్పాడు.
అంతేకాకుండా ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు రాంగోపాల్ వర్మ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో నిజమని నమ్ముతున్న అబద్ధాల మాటున దాగిన నగ్న సత్యాలను, అసలుసిసలు వాస్తవాలను తెరకెక్కిస్తున్నట్లు వర్మ చెప్పాడు. ఎవరైతే ఎన్టీఆర్ కడుపుపై గుద్ది, వెన్నుపోటు పొడిచారో.. వారి గురించి అసలు నిజాలను బయటపెడతానని వర్మ సంచలన ప్రకటన చేశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్టీఆర్ జీవితంలో నిజంగా ఏం జరిగిందో, మరీ ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో ఏం జరిగిందనే విషయంపై ఉంటుందని వర్మ ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు.
కానీ.. ఎవరితో ఈ సినిమా తీసేది మాత్రం ప్రకటించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తానని గతంలో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. మరి ఇప్పుడు వర్మేమో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని టైటిల్ పెట్టారు. అంటే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరవాత జరిగిన పరిణామాలే ఈ సినిమాలో ఎక్కువగా చూపించే అవకాశమున్నట్టు అర్థమౌతోంది. మరి ఇలాంటి స్క్రిప్ట్‌ని బాలయ్య ఒప్పుకుంటాడా..? పోనీ బాలయ్యతో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తే నందమూరి ఫ్యామిలీ ఊరకనే ఉంటుందా..? ఈ విషయాలపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.