‘శివ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాతో ఈయన రేంజ్ అమాంతం పెరిగింది. వర్మ సారధ్యంలో ఓ ఫిల్మ్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఇదే విషయంపై హైదరాబాద్‌లో విలేకర్ల సమావేంలో వర్మ మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ అన్ స్కూల్’ను న్యూయార్క్‌కు చెందిన రామ్ స్వరూప్, శ్వేతా రెడ్డితో కలిసి తను ఈ స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
నేను చదువుకునే రోజుల్లో రెండు సార్లు ఫెయిల్ అయి ఇనిస్టిట్యూట్ స్థాపించడం విచిత్రమన్నారు. నేను స్కూల్‌లో నేర్చుకున్నది ఏమీ లేదని పదో తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ రెండేసిసార్లు తప్పానని తెలిపారు. ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు అన్ని నియమాల్ని పూర్తిగా పక్కన పెట్టాను. ఆ సమయంలో సినిమా గురించి సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఏమాత్రం లేదు. నాకు ఏది అనిపిస్తే అది చేశానని అన్నారు.
ఇప్పుడున్న చాలా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లు మాత్రం పాత పద్ధతులనే అనుసరిస్తున్నారని అనిపిస్తోంది. కానీ నేను ప్రారంభించబోయే ఈ స్కూల్ మాత్రం వాటికి భిన్నంగా ఉండబోతోంది. విద్యార్థులతో నేను కూడా కలుస్తా. ఈ స్కూల్లను హైదరాబాద్, ముంబయి, అమెరికాలలో నిర్వహించబోతున్నాం. అడ్మిషన్లు ఇతర వివరాల గురించి ఇరవై రోజుల్లో చెబుతాం. నా స్కూల్లో ప్రతిభావంతులు ఉంటే వాళ్లతో ముందు నేనే పనిచేయించుకుని నా లాంటివాళ్లని మరికొంత మందిని తయారు చేసి చిత్రసీమలోకి వదులుతా అని తెలిపారు.