డిసెంబర్ 21, 2012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు! ఆ రోజు యుగాంతం రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్ ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాలి. ఎందుకంటే… శివ శంకర వరప్రసాద్ పాత్రలో యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ఆ రోజు నుంచి థియేటర్లలో సందడి చేయనున్నారు.
కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైందీ సినిమా.
మెగాస్టార్ చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ‘బెదురులంక 2012’లో కార్తికేయ క్యారెక్టర్ పేరు కూడా అదే. ఇప్పుడీ సినిమా ట్రైలర్ సైతం చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తికేయకు, చిత్ర బృందానికి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ”కార్తికేయ, నేహా శెట్టిల జంట చాలా బాగుంది. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారి పాత్ర వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంది. సంగీతం కూడా చాలా కొత్తగా వినిపించింది. ‘ఆర్ఎక్స్ 100’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు.
కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా… ‘బెదురులంక 2012’లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ ద్వారా చెప్పకనే చిత్రబృందం చెప్పింది. శివశంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ కనిపించగా… అతడిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా నేహా శెట్టి నటించారు. తాను సిగరెట్ కాల్చడం వల్ల పోతే తన లంగ్స్ పోతాయని, వస్తే తనకే క్యాన్సర్ వస్తుందని ఊరి పెద్దలకు శివ చెప్పడం చూస్తుంటే వాళ్ళను అతడు లెక్క చేయడని అర్థం అవుతోంది. యుగాంతం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన పెద్దలకు శివ ఎలా బుద్ధి చెప్పాడు? అనేది కథ అని అర్థం అవుతోంది.
Also Read:ఖుషి కోసం తీవ్రంగా శ్రమించిన సామ్!
‘సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పప్పటికీ… ముందు మూడు యుగాలను అంతం అవ్వలేకుండా ఆపలేకపోయినప్పుడు… ఈ బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రామ్ ప్రసాద్) కలిసి కలి యుగాంతాన్ని ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి?’ అని హీరో ఓ డైలాగ్ చెబుతారు. ప్రేక్షకుల్లో ఆ మాట ఆలోచన కలిగించేలా ఉంది.
‘బెదురులంక 2012’ ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని దర్శక నిర్మాతలు బెన్నీ, క్లాక్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని చెప్పారు. ప్రేక్షకుల్ని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, గోదావరి నేపథ్యంలో సినిమాలకు ఇదొక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం : క్లాక్స్.
Also Read:ఆ పాత్రల కోసం హీరోగారి కూతురు తాపత్రయం