‘ఖైదీ నెంబర్ 150’లో ధృవ

131
Ram Charan at Chiranjeevi's Khaidi no 150

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ `ఖైదీ నంబ‌ర్ 150` షూటింగ్ పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా విడుదల కానున్న చిరు 150పై భారీ అంచనాలున్నాయి. బాస్ ఇజ్ బ్యాక్ అంటూ విడుదల చేసిన స్టిల్స్ దగ్గరి నుంచి ఫస్ట్ లుక్‌ వరకు మెగాస్టార్ అభిమానులను కనువిందు చేశారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత తెర‌పై క‌నిపిస్తున్న చిరు… ఎలా క‌నిపిస్తారోన‌ని ఆయ‌న అభిమానులు తెగ ఇదైపోయారు. వ‌య‌సు పైబ‌డ‌డం, రాజ‌కీయాల్లోకి దిగిన నేప‌థ్యంలో… గ‌తంలో ఆయ‌న‌లో క‌నిపించిన యంగ్ మేన‌రిజమ్ ఇప్పుడు క‌నిపిస్తుందా? అన్న బెంగ కూడా ఆయ‌న ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టింది. అయితే అభిమానుల్లోని ఆ బెంగ‌ను చిరు ఒక్క దెబ్బ‌తో… ఫ‌స్ట్ లుక్‌లోనే ప‌టా పంచ‌లు చేశారు.

వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఈ చిత్రంలో అందాల తార‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిరంజీవి కుమారుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కొత్త‌గా ఏర్పాటు చేసిన త‌న సొంత బేన‌ర్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు రాంచరణ్ కనిపించనున్నారు. అంతేకాదు చిరుతో కలిసి ఓ పాటలో చెర్రీ స్టెప్పు వేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణ్ వెల్లడించారు. ‘‘నాన్నగారి సినిమాలో నేనూ కనిపిస్తా. ఓ పాటలో ఆయనతో కలసి స్టెప్పులు వేశా. నాన్నగారి ప్రతిష్ఠాత్మక చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. వినాయక్‌ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడు ఉన్నందున ఆ సినిమా విషయంలో పెద్దగా కలగజేసుకొనే అవసరం ఉండడం లేదు. క్రిస్మస్‌కి ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేస్తాం. ఆడియో వేడుక ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. జనవరి 11 లేదా 12న సినిమాని విడుదల చేసే అవకాశం ఉంద’’న్నారు.

గతంలో చెర్రీ సినిమాలో మెగాస్టార్ కనిపించి అభిమానులను కనువిందు చేయగా…..తాజాగా చిరు సినిమాలో రాంచరణ్ కనిపించనున్నారు.