అన్నా చెల్లెళ్ళ – అక్క తమ్ముళ్ళ అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రతీక అమ్మానాన్నలతో సమానంగా ప్రేమను పంచిన సోదరులకు అన్నింటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది. కులం, మతం అనే భేదాలు లేకుండా భారతదేశమంతా ఒక వసుదైక కుటుంబం అని చాటే ఒక అర్ధం ఈ రాఖి పండుగలో ఇమిడి ఉంది.అన్నదమ్ములు లేని వారు కూడ తాము సోదరులుగా భావించుకునే వ్యక్తులకు రాఖీని కట్టి ఈ పండుగను చేసుకుంటారు. ఆ క్షణంలో చెల్లిపోయేది కాదు. జీవితాంతం నిలిచిపోయేది. అన్నయ్య కలలు పండాలన్నా… చెల్లాయి మనస్సు నిండాలన్నా అది స్వచ్ఛమైన రక్షాబంధన్‌కే సాధ్యం. శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. ఆ రోజు రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను భారతదేశమంతా జరుపుకుంటారు.
భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది.
RakshaBandhanఒకరి సుఖాన్ని, ఉజ్వల భవితవ్వాన్ని మరొకరు కాంక్షించి ఆనందాన్ని పంచుకుంటారు. సోదరీలు తమ తోబుట్టువులైన అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారి క్షేమం కోసం భగవంతుని ప్రార్థిస్తారు. భారతదేశంలో రాఖీ పండుగ (రక్షాబంధనం) ముఖ్యంగా ఉత్తరాది వారి సాంప్రదాయమైనప్పటికీ దక్షిణాదికి కూడా సంక్రమించడం వల్ల యావత్ భారతదేశంలో జరుపుకొంటారు. అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టిన సందర్భంగా సోదరులు వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు, తమ సోదరీల రక్షణ బాధ్యతను తమ విధిగా భావించడం ఈ పండుగలోని ఆంతర్యం.
భిన్నత్వంలో ఏకవత్వం సాధించబడాలంటే రాఖీ పండుగ ఆవశ్యకత ఎంతయినా ఉంది. మనుషులు మారినా, ఆత్మీయతలు, అనుబంధాలు విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా అనురాగాల పండుగగా ఇది పది కాలాల పాటు నిలుస్తోంది. నా అన్నవారు లేకపోయినా అమితంగా ఆత్మీయ అనురాగాలను పంచుకునే స్త్రీ పురుషుల మధ్య కూడా రక్షాబంధన్ పవిత్రతను ఆపాదిస్తోంది.మహాబలవంతుడు, దానశీలుడు, రాక్షస రాజైన బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తిలో బంధించాడు. అంతటి విష్ణు శక్తి కలిగిన రక్షాబంధన్‌ను నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా! నువు స్థిరత్వంతో వుందువుగాక అంటూ నోటికి తీపిని అందిస్తారు. సోదరుని జీవితం ఎల్లప్పుడూ సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా ప్రతి సోదరి దైవాన్ని స్మరిస్తుంది. ఈ విధంగా రక్షాబంధన్‌కు చారిత్రక విశిష్ణత కూడా లభించింది.
ప్రపంచం యాంత్రికమై సెల్ ఫోన్స్ కు ఇంటర్ నెట్ కు యూత్ అతుక్కుపోతున్న నేటి రోజులలో అనుబంధాలను జ్ఞాపకం చేస్తూ అందరికీ ఆ ఆనుబంధాలను మరింత పచాలని కోరుకుంటూ greattelangaana.com శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
Also Read:TTD:మంత్రాలయం స్వామివారికి శేషవస్త్రం