ఉదయపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశంలో పెరుగుతున్న వైట్‌కాలర్ ఉగ్రవాదం పై ఆందోళన వ్యక్తం చేశారు. విలువలు లేని విద్య సమాజానికి ప్రాణాంతకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. దీనికి ఉదాహరణగా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను ప్రస్తావించారు. ఆ ఘటనలో నిందితులుగా అరెస్టైన వారు విద్యావంతులైన డాక్టర్లేనని గుర్తు చేశారు.
డిసెంబర్ 26న జరిగే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు తప్పనిసరిగా అక్షరాస్యత లేని వారు కాదని, విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారూ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని చెప్పారు.
భూపాల్ నోబుల్స్ యూనివర్సిటీ 104వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్…ఈ రోజు దేశంలో ఒక భయంకరమైన వైట్‌కాలర్ టెర్రరిజం ధోరణి కనిపిస్తోంది. ఉన్నత విద్యావంతులు కూడా సమాజం, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పాల్గొన్నవారు డాక్టర్లు. వారి చేతిలో డిగ్రీ ఉంది, జేబులో ఆర్డీఎక్స్ ఉంది. ఇది జ్ఞానం విలువలు, స్వభావంతో కలిసే ఉండాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది అని అన్నారు.
ఆ పేలుడు ఘటనలో పేలుడు పదార్థాలతో నిండిన ఐ20 కారును డా. ఉమర్-ఉన్-నబీ నడిపినట్లు, ఈ ఘటనలో 15 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. అనంతరం జరిగిన దర్యాప్తులో వైట్‌కాలర్ ఉగ్రవాద మాడ్యూల్‌ను వెలికితీశారని, ఇందులో ముజమ్మిల్ గనాయ్, అదీల్ రాధర్, షహీనా సయీద్ అనే ముగ్గురు డాక్టర్లను సహా పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడైంది.
విద్య లక్ష్యం కేవలం వృత్తిపరమైన విజయమే కాదు. నైతికత, ధర్మం, మానవీయ విలువల వికాసం కూడా కావాలి. వినయం, చరిత్ర, ధర్మబోధ లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే ఇచ్చే విద్యా విధానం అసంపూర్ణం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Also Read:మహారాష్ట్ర గ్రీన్ విప్లవానికి GIC తోడ్పాటు

