తమిళనాట అంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న తరుణం రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొత్తపార్టీతో తమిళనాట కింగ్ మేకర్‌గా మారేందుకు రజనీ శరవేగంగా పావులు కదుపుతున్నాడు. డిసెంబర్ 12న అంటే రజనీ బర్త్ డే రోజున రాజకీయ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
జయలలిత మరణం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది రజనీ పొలిటికల్ రాకను వ్యతిరేకిస్తుంటే మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రజనీ కమలం గూటికి చేరుతారా.. సొంత పార్టీతో ప్రజల్లోకి వస్తారా..? అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ కసరత్తులు తెరమీదకు వచ్చాయి. ఢిల్లీ వేదికగా కసరత్తులు వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల కమిటీ రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో దూసుకెళ్తున్నట్లు సమాచారం. అంతేగాదు ఎన్నికల కమిషన్‌కు పార్టీ రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రస్తుతం రజనీ రెండు సినిమాల్లో బిజీగా ఉండగా వీటిని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి తన బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతున్నాడుట. ఇప్పటికే పలువురు నేతలు కూడా రజనీతో టచ్‌లో ఉన్నారని, ప్రజల స్పందన తెలుసుకునేందుకు ఓ ఏజెన్సీ సాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.