తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులు కూడా ఉన్నారు. గత ఎనిమిదేళ్లలో ఫ్యాన్స్‌తో కేవలం ఫొటోలు మాత్రమే దిగి వారికి చాలా తక్కువ టైం ఇచ్చిన తలైవా..తాజాగా వారితో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా 4 రోజులు కేటాయించారు. తన బిజీ షెడ్యూల్ వల్ల అభిమానులతో ఎక్కువ సమయం గడపని రజనీ, ఇపుడు వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని నిర్ణయించారు.
మే 15 నుంచి 19 వరకు 4 రోజులపాటు బ్యాచ్‌ల వారీగా తన అభిమాన సంఘాల ప్రతినిధులతో రజనీ భేటీ కానున్నారు. 2009లో శివాజీ సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌తో సమావేశమైన రజనీ, మళ్లీ ఇన్నాళ్లకు వారికి సమయం కేటాయించనుండటం విశేషం.
మరోవైపు రజిని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నది వాస్తవం. వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా మద్దతు కోసం ఆయన్ను పలు సందర్భాల్లో కలవడానికి ప్రయత్నించింది కూడా తెలిసిందే. దీంతో ఎప్పటికప్పుడు రజిని రాజకీయ ప్రవేశం చర్చనీయాంశం అవుతోంది. మళ్లీ ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన అభిమానులకు పిలుపురావడం తాజా చర్చకు దారితీసింది.