సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు అభిమానులతో వరుస సమావేశాలు జరపనున్న సంగతి తెలిసిందే. కొడం బాక్కంలో ఈ రోజు వెయ్యి మంది అభిమానులతో రజనీ సమావేశం అయ్యారు. ఓఖీ తుఫాన్ మృతుల కుటుంబాలకి సంతాపం తెలిపిన రజనీ పలు విషయాలపై మాట్లాడుతున్నారు. తను హీరో కావడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్న రజనీ, మొదట్లో చాలా భయపడ్డానని తెలిపారు. హీరో కావాలని సినిమాల్లోకి రాలేదు, హీరోగా నా తొలి సంపాదన 50 వేలు అని రజినీ తెలిపారు.
రాజకీయాలు నాకు కొత్త కాదు..ఇప్పటికే ఆలస్యం చేశా. నేను రాజకీయాలలోకి రావడమంటే విజయం సాధించినట్టే అని రజినీకాంత్ స్పష్టం చేశారు. మే నెలలో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసిన తలైవా మళ్ళీ ఈ నెలలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయడంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఈ రోజు కాంచీపురం, తిరువళ్లూర్, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి ఫ్యాన్స్‌ని కలిసిన తలైవా, 27న తిరువారూర్, నాగపట్టణం, పుదుకోటైట , రామనాథపురం అభిమానులను, 28న మధురై, నామక్కల్, సేలమ్ ఫ్యాన్స్‌ను, 29న కోయంబత్తూర్, ఈరోడ్, వెల్లూర్ ఫ్యాన్స్‌ను, నార్త్ మరియు సెంట్రల్ చెన్నై ఫ్యాన్స్‌ను 30న, సౌత్ చెన్నై ఫ్యాన్స్‌ను 31న కలవనున్నట్టు తెలుస్తుంది. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై ఈ నెల 31న నిర్ణయం ప్రకటిస్తానని రజినీకాంత్ ఫ్యాన్స్ మీటింగ్‌లో తెలిపారు. దీంతో ఇప్పుడు తమిళ నాట ఆసక్తికర చర్చలు మొదలు అయ్యాయి.