సూపర్ స్టార్ రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ప్రస్తుత పరిణామాల్ని గమనిస్తే రజిని పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు అభిమానులు. రజినికాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇంతకు ముందే జోరుగా వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే రజిని మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఇదే నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
రజిని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నది వాస్తవం. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా మద్దతు కోసం ఆయన్ను పలు సందర్భాల్లో కలవడానికి ప్రయత్నించింది కూడా తెలిసిందే. దీంతో ఎప్పటికప్పుడు రజిని రాజకీయ ప్రవేశం చర్చనీయాంశం అవుతోంది. మళ్లీ ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన అభిమానులకు పిలుపురావడం తాజా చర్చకుదారితీసింది.
ఏప్రిల్ 2న రజనీకాంత్ అభిమానులు సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి రజనీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం అజెండా ఏమిటనేది మాత్రం స్పష్టంగా తెలియదు. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మరోమారు వూహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల మధ్య రజినీ కీలక ప్రకటన చేస్తారన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
అయితే.. ఇది కేవలం అభిమాన సంఘనాయకులతో కూడిన సమావేశం మాత్రమేనని.. అంతకుమించి ఏమీ లేదని మరికొంత మంది అంటున్నారు. 2009లో శివాజీ చిత్ర విజయానంతరం ఇటువంటి సమావేశం జరిగిందని.. మళ్లీ ఇప్పుడు అటువంటి సమావేశమే జరగనుందని తెలిపారు. ఏదేమైనా..ఏప్రిల్ 2న రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఉండనుందా? లేక ఇవన్నీ పుకార్లేనా అనే విషయం బయటపడుతుంది. అయితే ఆ సమయం కోసం రజినీ అభిమానులతో పాటు రాజకీయ నేతలు కూడా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.